9 July, 2026 | 11:10 PM

స్థూల ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశంలోనే అగ్రస్థానం

09-07-2026 01:44 PM

సుదీర్ఘ విజన్, లక్ష్యలతో ముందుకు సాగుతున్న సీఎం రేవంత్

పెట్టుబడులతో పాటు ఆవిష్కరణలు, ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సాహం

షాబాద్: రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాంపూర్‌లో 'ప్రీమియర్ ఎనర్జీస్' యూనిట్ ప్రారంభమైంది. ఇండియాస్ నెక్ట్స్ -జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియాస్ నెక్ట్స్ -జెన్ సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సోలార్స్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కావటం సంతోషకరం అన్నారు. సీతారాంపురంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

నెక్ట్స్ జెన్ సంస్థ భూమి అడగ్గానే ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. స్థూల ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సుదీర్ఘ విజన్, లక్ష్యాలతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని కొనియాడారు. పెట్టుబడులతో పాటు ఆవిష్కరణలు,ఉత్పత్తిని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ సాధించి.. నిర్మిస్తున్నామన్నారు. 3 ట్రిలియన్ డాలర్స్ ఆర్థికవ్యవస్థ లక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా వెళ్తోందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని.. ఏటా పెరుగుతున్న విద్యుత్ చాటిచెప్తోందని వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో మా పాలసీ.. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కొండారెడ్డిపల్లిని వందశాతం గ్రీన్ ఎనర్జీ గ్రామంగా తీర్చిదిద్దామని తెలిపారు.