మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కావాలి
ఎమ్మెల్యే మల్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 11 (విజయక్రాంతి): నియోజకవర్గంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే మార్చి 31 నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రజాభవన్లో హౌసింగ్ పీడీ చంప్లా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ... నియోజకవర్గానికి మొత్తం 3,500 ఇళ్లు మంజూరు కాగా,
రెండో విడతలో 1,500 ఇళ్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇప్పటివరకు పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గతంలో రూఫ్ లెవల్ (రేకులు) వరకు వచ్చి ఆగిపోయిన ఇళ్లకు ప్రభుత్వం అదనంగా రూ.2 లక్షల సాయం అందిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






