25 April, 2026 | 2:02 AM

నత్తనడకన ఇందిరమ్మ ఇండ్లు..!

25-04-2026 12:19 AM
  1. ఉమ్మడి జిల్లాలో ‘ఇందిరమ్మ’ నిర్మాణాల తీరిది
  2. ‘ప్రజాపాలన’ ముగిసేలోపు గృహ ప్రవేశాల లక్ష్యం చేరేనా?
  3. ఉమ్మడి జిల్లాలో 34,803 ఇండ్లు మంజూరు
  4. గృహ ప్రవేశాలు చేసినవి దాదాపు 1200 లోపే..

సంగారెడ్డి, ఏప్రిల్ 24(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలను చేయించాలని ఆదేశించింది. అయితే జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిని పరిశీలిస్తే ఆ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. పనులు నత్తనడకన సాగుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక్కో నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది.

పథకంలో భాగంగా తొలి విడతగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో గతేడాది ఫిబ్రవరి, మార్చిలో ఇళ్లు మంజూరు కాగా, పట్టణ ప్రాంతాల్లో మే, జూన్ నెలల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రారంభంలో నిర్మాణాలకు లబ్దిదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఆర్థిక స్థోమత లేకపోవడం, బిల్లులు సకాలంలో వస్తాయో రావోననే కారణాలతో నిర్మాణాలకు వెనుకడుగు వేశారు. అయితే పూర్తయిన ఇళ్లకు బిల్లులు వస్తుండటంతో మిగతా వారిలో ఆసక్తి పెరిగింది. 

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి...

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 15,429 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అయితే, వీటిలో కొన్ని వివిధ కారణాల వల్ల రద్దవగా ప్రస్తుతం 12,527 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించబడ్డాయి. వీటిలో పనులు ప్రారంభమైనవి (ముగ్గులు పోసినవి) 8,277 ఇండ్లు కాగా, బేస్మెంట్ దశలో ఉన్నవి 6,683 ఇండ్లు, గోడల నిర్మాణం పూర్తయినవి 4,966 ఇండ్లు. స్లాబ్ దశకు చేరుకున్నవి 3,826 ఇండ్లు, పూర్తయి గృహ ప్రవేశాలు జరిగినవి కేవలం 354 ఇండ్లు మాత్రమే. జిల్లాలో మంజూరైన తర్వాత కూడా 9 నెలల వరకు పనులు ప్రారంభించని 4,250 ఇండ్లను అధికారులు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ ఇండ్లను కొత్తగా ఇతర అర్హులైన లబ్ధిదారులకు కేటాయించనున్నారు.

ఇక మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 9,209 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో ప్రస్తుతం 5,337 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బేస్మెంట్ దశలో దాదాపు 2,439 ఇండ్లు, గోడల నిర్మాణం వరకు 944 ఇండ్లు, స్లాబ్ దశకు సుమారు 673 ఇండ్లు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 750 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, వాటిలో 650 ఇళ్లకు గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. అలాగే సిద్దిపేట జిల్లాలో మొత్తం 13,067 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.

వాటిలో 9,231 మంది లబ్ధిదారులు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. సుమారు 7,636 ఇండ్లు పునాది, గోడలు లేదా స్లాబ్ వంటి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. తొగుట మండలం కాన్గల్ గ్రామంలో ఇటీవల లబ్ధిదారులు సొంత ఇళ్లలోకి ప్రవేశించారు. మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించని 3,836 ఇళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ ఇళ్లను కొత్తగా ఇతర అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. ఇటీవల సిమెంట్, ఇసుక, స్టీల్ సామగ్రి ధరలు పెరగడం కూడా నిర్మాణాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.