13 March, 2026 | 3:32 AM

భారత నౌకలకు హోర్ముజ్ అనుమతి

13-03-2026 12:24 AM

జలసంధి ద్వారా ముంబైకి చేరిన చమురు మొదటి ట్యాంకర్

ఇరాన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు సఫలం

సౌదీ నుంచి ముంబైకి వచ్చిన లైబీరియా జెండా కలిగిన షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్ 

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ నౌకలు

ఎలాంటి భయాందోళనలు వద్దు 

పూర్తిగా సురక్షితంగా భారత్ చమురు సరఫరా 

కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి

భారత్ చమురు కొనుగోళ్లను అమెరికా నిర్ణయించాలా?

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

టెహ్రాన్/న్యూఢిల్లీ, మార్చి 12: పశ్చిమాసియా దేశాల్లో తీవ్రమవుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన భారత నౌకలకు శుభవార్త. హోర్ముజ్ జలసంధి ద్వారా భారత నౌకలు ప్రయాణించేలా ఇరాన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్, యూఎస్ మధ్య యుద్ధ పరిస్థితుల మధ్య హోర్ముజ్ జలసంధిలో భారత చము రు ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి ఇచ్చింది.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో గత కొన్ని రోజులుగా నిర్వహించిన కీలక చర్చల అనంతరం గురువారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా భారత దేశానికి చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు మార్గం సుగమమైందని తెలిపింది.

ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత రద్దీగా, వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఉత్పత్తి దేశాల నుంచి ఆసియా, యూరప్ దేశాలకు వెళ్లే భారీ ట్యాంకర్లు ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తుంటాయి. ఈ మార్గంలో ఏ చిన్న అవరోధం ఏర్పడినా ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ అధికారులతో జరిగిన చర్చల ఫలితంగా భారత జెండా కలిగిన చమురు ట్యాంకర్లు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ నౌకలు ఈ దారిలో వెళ్లేందుకు అనుమతి లభించినట్లు రాయిటర్స్ కథనంలో పేర్కొంది.

అమెరికా, యూరప్, ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలకు మాత్రం ప్రస్తుతం పరిమితులు విధించినట్లు సమాచారం. ఇటీవల ఐఆర్‌జీసీ హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించి, అక్కడ నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరగవచ్చని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇతర కీలక దేశాల విదేశాంగ మంత్రులతో కూడా చర్చించినట్లు తెలిపింది. రస్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోప్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోతో ప్రాంతీయ పరిస్థితులు, సముద్ర మార్గాల భద్రతపై చర్చలు జరిగినట్లు సమాచారం. 

ముంబైకి చేరిన మొదటి ఇంధన ట్యాంకర్

యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అనుమతి పొందిన తర్వాత సౌదీ ఓడరేవు నుంచి ఒక చమురు ట్యాంకర్ హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించి, ముంబైకి బుధవారం సురక్షితంగా చేరింది. ఇరాన్, యూఎస్ ఉద్రిక్తతల్లో ఇండడియాకు వచ్చిన మొదటి చమురు ట్యాంకర్ ఇదే. లైబీరియా జెండా కలిగిన ఈ ముడి చమురు ట్యాంకర్ షెన్‌లాంగ్ సూయెజ్‌మాక్స్.. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా ఓడరేవు నుంచి ముడి చమురును నింపుకుని ముంబై ఓడరేవుకు వచ్చిందని ముంబై పోర్ట్ ట్రస్ట్ తెలిపింది. 28 భారతీయ జెండా కలిగిన నౌకలు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వీటిలో, 677 మంది భారతీయ నావికులను తీసుకెళ్లే 24 నౌకలు హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన, 101 మంది భారతీయ నావికులతో 4 నౌకలు జలసంధికి తూర్పున ఉన్నాయని పేర్కొంది. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. భారత నావికుల భద్రత కోసం విదేశాంగ మిషన్లు, షిప్పింగ్ సంస్థలతో సమన్వయం కొనసాగుతోంది.

ఇంధన భద్రతపై విధానమేంటో చెప్పాలి: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

భారత్.. చమురు కొనుగోళ్లను అమెరికా నిర్ణయించాలా..? రష్యా నుంచి క్రూడాయిల్ కొనేందుకు యూఎస్ పర్మిషన్ ఎందుకు తీ సుకోవాల్సి వచ్చింది.. అంటూ నిలదీశారు ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ. గురువారం లోక్ సభలో చమురు సమస్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇంధన భద్రతపై మన విధానమేంటో చెప్పాలని నిలదీశారు. ఒక దేశానికి ఇంధన భద్రతే పునాది అని స్పష్టం చేశారు. భారతదేశం వంటి పెద్ద దేశం తన విదేశాంగ, వాణిజ్య సంబంధాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైందని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండబోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వెళ్లే హోర్ముజ్ జలసంధి మూసివేయబడిందని పేర్కొంటూ ఇది భారత్‌కు పెద్ద ముప్పుగా మారవచ్చని అన్నారు. భారత్‌కు వచ్చే చమురు, సహజ వాయువులో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే వస్తుందని గుర్తుచేశారు. ఇప్పటికే గ్యాస్ కొరతపై భయాందోళనలు మొదలయ్యాయని, కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంధన భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం ముందుగా ప్రణాళికలు రూపొందించడంలో విఫలం అయ్యిందన్నారు. పార్లమెంట్ లోపల, బయట ఈ అంశంపై పో రాటాన్ని ఉధృతం చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి, గ్యాస్ సరఫరాను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

చమురు కొరత ఆందోళన వద్దు : కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి

భారత్‌కు చమురు సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర పెట్రోలి యం మంత్రి హర్దీప్ సింగ్ పురి అ న్నారు. లోక్‌సభలో గురువారం మాట్లాడిన ఆయన ప్రస్తుత పరిస్థితిపై వదంతులు వ్యాప్తి చేయడం సరికాదని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆధునిక ఇంధన చరిత్రలో ప్రపం చం ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొం టూ, అయినప్పటికీ భారత్ చమురు సరఫరా పూర్తిగా సురక్షితంగా ఉందన్నారు.

హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా గతంలో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో సుమా రు 45 శాతం రవాణా జరిగేదని తెలిపారు. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితు ల్లో కూడా భారత్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ చమురు సరఫరా ఒప్పందాలు ఇప్పటికే కుదుర్చుకున్నామని వెల్లడించారు. ప్రధాని దౌత్య చాతుర్యం, ఇతర దేశాలతో ఉన్న మంచి సంబంధాల వల్ల హోర్ముజ్ మార్గం అంతరా యం కలిగించిన పరిమాణం కన్నా ఎక్కువ చమురు భారత్‌కు లభించేలా ఏర్పాట్లు జరిగాయని తెలిపా రు. దీంతో దేశంలో చమురు సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరా యం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.