calender_icon.png 22 February, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ కు ఎదురుందా?

22-02-2026 01:18:17 AM

నేడు సౌతాఫ్రికాతో సూపర్-8 పోరు

అభిషేక్ పైనే అందరి చూపు

తుది జట్టు కూర్పుపై సస్పెన్స్

తిలక్‌ను తప్పిస్తారా ?

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క.. నిజమే గ్రూప్ స్జేజ్‌లో పెద్దగా పోటీ ఎదుర్కోని టీమిండియా ఇప్పుడు సూపర్ 8 మ్యాచ్‌లకు రెడీ అయింది. టైటిల్ ఫేవరెట్స్‌గా భావిస్తున్న సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్న గ్రూప్‌లోనే భారత్ చోటు దక్కించుకుంది. సెమీస్ రేసులో వెనుకబడకుండా ఉండాలంటే సూపర్ 8లో శుభారంభం చేయాల్సిందే. ఇక్కడ తుది జట్టు కూర్పే సస్పెన్స్‌గా మారింది. అభిషేక్ శర్మను తప్పిస్తారా.. సంజూకు అవకాశం దక్కుతుందా.. తిలక్ వర్మపై వేటు పడుతుందన్న వార్తలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

అహ్మదాబాద్, ఫిబ్రవరి 21: టీ20 ప్ర పంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అంచనాలకు తగ్గట్టే గ్రూప్ స్జేజ్ ను పూర్తి చేసింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో నూ గెలిచి అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సూపర్ 8 స్టేజ్ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడబోతోంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగబోతోంది. ప్రస్తుతం భారత తుది జట్టు కూర్పుపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలతో ఈ మెగాటోర్నీకి వచ్చిన అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

ఆడిన మూడు మ్యా చ్‌లలోనూ డకౌటయ్యాడు. దీంతో అభిషేక్‌ను తప్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవడం.. అదే సమయంలో సంజూ శాంసన్ కూడా ఫామ్ లో లేకపోవడంతో కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది. కీలక మ్యాచ్‌లో అభిషేక్‌కు మరొక అవకాశం ఇస్తే ఫా మ్ అందుకునే అవకాశముంది. మరోవైపు నెట్ ప్రాక్టీస్‌లో సంజూ శాంసన్ చాలా సీరియస్‌గా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయడంతో అతని రీఎంట్రీ ఇచ్చేందుకేనని వార్తలు వస్తున్నాయి. అటు మిడిల్ ఓవర్స్‌లో స్పిన్ ఆడడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు.

ముఖ్యంగా తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. దీంతో అతన్ని తప్పించి సంజూకు ఛాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు. సూర్యకుమార్, దూబే, హార్థిక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తే భారీస్కోరు ఖాయం. మరోవైపు భారత్ బౌలింగ్ ఇంకా కొంచెం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. వరుణ్ చక్రవర్తి మినహా మిగిలిన బౌలర్లు ఆకట్టుకోలేకపోతున్నారు. పైగా భారీగా పరుగులిచ్చేస్తున్నారు.

దీంతో సౌతాఫ్రికా జట్టులో టాప్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే బౌలర్లు సమష్టిగా రాణించాల్సిందే. పేసర్లు బుమ్రా, అర్షదీప్ సింగ్ లపై అంచనాలున్నాయి. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడం ఖాయమైంది. హార్థిక్ పాండ్యా, దూబేలు కూడా బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో రాణిస్తున్నారు. మొత్తం మీద భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది.  

తుది జట్లు అంచనా

భారత్: అభిషేక్ , ఇషాన్ కిషన్, తిలక్ వర్మ/సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా

సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్ రమ్, డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, మార్కో ఎన్సన్, కార్బిన్ బోస్చ్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి