ఫైనాల్లో భారత్
సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపు
సెంచరీతో వణికించిన బెథల్
బ్యాటింగ్‌లో సంజూ విధ్వంసం
ఆదివారం న్యూజిలాండ్‌తో టైటిల్ పోరు
భారత్ స్కోర్ 253/7... ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ 95/4 వికెట్లు డౌన్.. ఇంకేముంది భారత్ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారంతా... కానీ ఇంగ్లాండ్ అంత తేలిగ్గా తలవంచలేదు. వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తామంటూ చెప్పిన మాటలు నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జాకబ్ బెథల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోగా.. విల్ జాక్స్ , సామ్ కరన్ చివర్లో సపోర్ట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ చివరి వరకూ టెన్షన్ పెట్టింది. బుమ్రా 18 ఓవర్‌ను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకుంటే మ్యాచ్ భారత్ చేజారిపోయేది. చివరి వరకూ పోరాడిన ఇంగ్లాండ్ 245 పరుగులకు పరిమితమైంది. కేవలం 7 రన్స్‌తో గెలిచిన భారత్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
ముంబై, మార్చి 5 : ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. తుది జట్టు ఎటువంటి మార్పులు చేయలేదు. నాకౌట్ మ్యాచ్ కావడంతో మొదటి బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్థేసిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే వ్యూహం బాగానే సక్సెస్ అయ్యింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులకే ఔటయ్యాడు. అయితే విండీస్‌పై దుమ్మురేపిన సంజూ శాం సన్ ఇంగ్లాండ్ పైనే రెచ్చిపోయాడు. ఇంగ్లీష్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
అట ఇషాన్ కిషన్ కూడా చెలరేగిపోవడంతో భా రత్ స్కోరు బోర్డు ఫస్ట్ గేర్ లో సాగింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 45 బం తుల్లోనే 97 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 39 పరుగులు చేసి ఔటవగా.. సంజూకు దూబే జత కలిసాడు. భారీస్కోరు అందించడమే లక్ష్యంగా వీరిద్దరూ కూడా చెలరేగిపోయారు. ఫలితంగా భారత్ రన్‌రేట్ ఓవర్‌కు 12కు పైగా సాగింది.
సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 (8 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేయగా.. దూబే 25 బంతుల్లో 43 (1 ఫోర్, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. చివర్లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కూడా విధ్వంసం సృష్టించాడు. కేవ లం 7 బంతుల్లోనే 21 పరుగులు చేయగా.. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 5, హ్యారీ బ్రూక్ 7, బట్లర్ 27 పరుగులకు ఔటవగా..టామ్ బాంటన్ 17 రన్స్‌కు వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ 95 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయింది.
అయితే విల్ జాక్స్, జాకబ్ బెథల్ పార్టనర్ షిప్ మళ్లీ ఇంగ్లాండ్‌కు విజయంపై ఆశలు రేకెత్తించింది. ముఖ్యంగా బెథెల్ భారీ షాట్లతో భారత బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు. అటు విల్ జాక్స్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ సాధించాల్సిన రన్‌రేట్ మరీ పెరిగిపోకుండా జాగ్రత్తగా ఆడింది. వీరిద్దరూ 39 బంతుల్లోనే 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విల్ జాక్స్ 35 రన్స్‌కు ఔటైనా.. బెథల్, సామ్ కరన్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు.
వీరి జోడీ 27 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, బెథల్ సెంచరీ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. బెథల్ 45 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండగా.. 18వ ఓవర్‌ను బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఆరు పరుగులే ఇవ్వడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అయితే చివర్లో భారత్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోవడంతో పెనాల్టీ పడింది. ఫలితంగా 30 యార్డ్ సర్కిల్ అవతల ముగ్గురినే ఉంచాల్సి వచ్చింది.
అయినప్పటకీ చివరి ఓవర్‌కు బంతిని అందుకున్న దూబే బౌలింగ్ లో బెథల్ రనౌట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఈ ఓవర్లో ఆర్చర్ మూడు సిక్సర్లు బాదినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఫలితంగా భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన టీమిండియా ఆదివారం జరిగే టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 253/7 (సంజూ శాంసన్ 89, దూబే 43, ఇషాన్ కిషన్ 39 ; విల్ జాక్స్ 2/40, ఆదిల్ రషీద్ 2/41)
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : 246/7 ( బెథల్ 105, విల్ జాక్స్ 35, బట్లర్ 25 ; పాండ్యా 2/38 ,బుమ్రా 1/33 , అక్షర్ పటేల్ 1/35 )




