ఇండియా కూటమి మోకాలడ్డు
- మహిళా సాధికారతకు ఎందుకు మద్దతివ్వరు?
- డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలూ 5౦ శాతం పెంపు
- కేంద్ర హోమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౭: మహిళలకు చట్టసభల్లో ౩౩ శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 131వ చట్ట సవరణ బిల్లుకు విపక్షాలు మోకాలడ్డుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ౩ బిల్లులకు ఓటింగ్‌కు ముందు ఆయన ప్రసంగిస్తూ.. ఇండియా కూటమికి చెందిన ప్రతి సభ్యుడూ మహిళా కోటా బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారని దుయ్యబట్టారు.
మహిళా సాధికారత కోసం ఒక మంచి బిల్లును ప్రవేశపెడితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను వ్యతిరేకించే వారు పరోక్షంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల పెరుగుదలనూ వ్యతిరేకిస్తున్నట్లేనని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదిలోనూ లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగుతుందని, కానీ.. కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
పునర్విభజన ద్వారా అన్ని రాష్ట్రాల్లో సమానంగా సీట్లు పెరుగుతాయని వెల్లడించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి చేరుతాయని ఉదాహరణగా చెప్పారు. సీట్ల పెరుగుదల వల్ల ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కొత్త నాయకులు కూడా ప్రజాప్రతినధులయ్యే అవకాశం ఉందని వివరించారు. డీలిమిటేషన్ బిల్లుతో కేవలం లోక్‌సభ స్థానాలే కాకుండా, రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలూ 50 శాతం మేర పెరుగుతాయని వెల్లడించారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయడమే తాము ప్రవేశపెట్టిన బిల్లుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. విపక్షాలు అనవసర ఆందోళనలు మానుకుని బిల్లుకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విపక్షాలపై మండిపడ్డారు. అసోం, జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికే మహిళా కోట అమలులో ఉందని గుర్తు చేశారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే పద్ధతిని అమలు చేయాలనేది తమ అభిమతమని వివరించారు. ౨౦౨౯ సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా ముందుకెళ్తున్నామని, ప్రస్తుత లోక్‌సభ స్థానాల్లోని జనాభాలో తీవ్ర వ్యత్యాసం ఉందని వివరించారు. ఒకచోట 39 లక్షల ఓటర్లు ఉంటే.. మరోచోట 60 వేల ఓటర్లు ఉంటున్నారని సోదాహరణంగా వెల్లడించారు. ఉదాహరణకు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో దాదాపు 30లక్షల మందికిపైగా ఓటర్లు ఉండగా.. దిల్లీ, బెంగళూరు, గాజియాబాద్ స్థానాల్లో 20లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు.
డీలిమిటేషన్ తర్వాత ఆయా చోట్ల రెండు సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. ‘ఒక ఎంపీ లక్షలాది మంది సమస్యలను ఎలా వింటారు? నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యలో సమతుల్యతను సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎంపీ తన నిధులు సమర్థంగా వినియోగించుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అందుకే ఈ రాజ్యాంగ సవరణకు ఉపక్రమించాం’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఏ విషయాన్నీ దాచేందుకు యత్నించడం లేదని స్పష్టంచేశారు.
విపక్షాలు పైకి మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం మోకాలడ్డుతున్నాయని వ్యాఖ్యానించారు. విపక్షాలు దేశాన్ని ఉత్తర, దక్షిణ లేదా తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విడదీసేందుకు యత్నిస్తున్నాయని, కేంద్రపాలిత ప్రాంతాలకు సైతం దేశంపై అంతే అధికారం ఉంటుందని, దయచేసి ఆ పని చేయవద్దని హితవు పలికారు. చట్టసభల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాన హక్కులు ఉంటాయని నొక్కి చెప్పారు.
గత చరిత్రను గుర్తుచేస్తూ 1972లో ఇందిరా గాంధీ హయాంలో సీట్ల సంఖ్యను పెంచారని, కానీ ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయంలో పునర్విభజనను నిలిపివేశారని గుర్తు చేశారు. అప్పుడు అడ్డుకున్న వారే ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నారని విమర్శించారు. 2026 జనగణనతో పాటే కుల గణనను కూడా నిర్వహించాలని ప్రధాని మోదీ మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. దీనిపై 140 కోట్ల మంది భారతీయులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.
ప్రస్తుత చర్చలో రికార్డు స్థాయిలో 133 మంది సభ్యులు పాల్గొన్నారని, అందులో 56 మంది మహిళలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. చివరగా ‘విపక్షాలు కోరితే సభకు గంటసేపు విరామమిస్తాం. అధికారికంగా కొన్ని సవరణలు చేసి బిల్లును తీసుకువస్తాం. మరి ఆ బిల్లుకు వారు మద్దతిస్తారేమో చెప్పాలి’ అని అమిత్ షా సవాల్ విసిరారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ భాష సరిగాలేదని, గౌరవప్రదమైన లోక్‌సభలో ఎలా మాట్లాడాలో ప్రియాంకను చూసైనా నేర్చుకోవాలని అన్నారు.






