18 April, 2026 | 3:24 AM

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్

18-04-2026 01:51 AM

ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ శుక్రవారం ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు ఆయన ఉప సభాపతి పదవిని చేపట్టడం విశేషం. ఏప్రిల్ 10న హరివంశ్ డిప్యూటీ చైర్మన్‌గా రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు. హరివంశ్‌ను ఉపసభాపతిగా ఎన్నుకోవడానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

అనంతరం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిప్యూటీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే మొదటిసారి.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మూడోసారి ఉపసభాపతిగా హరివంశ్ ఎన్నికవడం హర్షణీయమన్నారు. ఆయనపై సభకు ఉన్న ప్రగాఢమైన నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. అనుభవం, సభలో అందరినీ ఒకతాటిపై నడిపించడానికి ఆయన చేసిన ప్రయత్నాల వల్ల సభకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మోదీ అన్నారు. ‘డిప్యూటీ చైర్మన్ సభలో ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యం, సమయం ఇస్తారని నమ్ముతున్నా’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.