నాగిరెడ్డిపేట్ మండలంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచులు,అధికారులు
నాగిరెడ్డిపేట్,ఆగస్టు 16(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి.ఈ వేడుకలకు మండల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.నాగిరెడ్డిపేట్ మండలంలోని సర్పంచులు,మండల అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.వివిధ శాఖల అధికారులు వారి కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.పంద్రాగస్టు వేడుక సందర్భంగా మోడల్ స్కూల్ విద్యార్థులు, కస్తూర్బా విద్యార్థులు,కేరళ స్కూల్ విద్యార్థులు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.
ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు.మండలంలోని తాసిల్దార్,ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఎమ్మార్వో బిక్షపతి,డిఎల్పిఓ సురేందర్ తాండూరు,మాల్తుమ్మెద సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్లు ఆకిడి గంగారెడ్డి దుండిగల్ నర్సింహులు,స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్సై భార్గవ్ గౌడ్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.అలాగే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాని ఆవిష్కరించారు.80 పంద్రాగస్టు వేడుకలు సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,వివిధ అధికారులు,నాయకులు పాల్గొన్నారు.






