నూతన తరగతి గదులు ప్రారంభం
ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ గరిమ అగ్రవాల్
చదువుకున్న బడి కోసం రూ.లక్ష విరాళం
ఎల్లారెడ్డిపేట జూన్ 30 (విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు.
పూర్వ విద్యార్థి ప్రస్తుత చొప్పదండి ఎమ్మెల్యే చొరవతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అధికారులతో సంభాషించి తను చదువుకున్న బడి మీద మమకారాన్ని చూపారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయుడిని సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
మొక్కలు నాటడం, పరిశుభ్రత పాటించడం,నీటి వృథాను అరికట్టడం వంటి సామాజిక బాధ్యతలను కూడా విద్యార్థులు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బొప్పాపూర్ పాఠశాల అభివృద్ధికి రూ. లక్ష విరాళం ప్రకటించడంతో పాటు, పూర్వ విద్యార్థిగా పాఠశాల అభివృద్ధి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తన తోటి పూర్వవిద్యార్థులతో కలిసి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, మండల విద్యాధికారి కృష్ణహరి, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాబేర బేగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కోరుట్లపేట మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం, గ్రామ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి - శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






