జియో సైన్స్ లేబొరేటరీ ప్రారంభం
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంపై అధికారుల వివరణ
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజా ల విశ్లేషణను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లేబొరేటరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం ప్రారంభించారు. అనంత రం అత్యాధునిక యంత్ర పరికరాలు, ఖనిజా ల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు.
లేబొరేటరీలో అందుబాటులో ఉన్న పరీక్షా విధానాలు, విశ్లేషణ సామర్థ్యం, పరిశోధనల ప్రాముఖ్యతపై సింగరేణి అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ లేబొరేటరీ ద్వారా ఖనిజ నమూనాల విశ్లేషణ, బొగ్గు నాణ్యత నిర్ధారణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత వేగవంతంగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
దీంతో సింగరేణి సంస్థలో శాస్త్రీయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు ఆధునిక గనుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సేవలు మరింత మెరుగుపడనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్) గౌతమ్ పొట్రూ, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, సింగరేణి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






