షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం
కట్టుబట్టలతో మిగిలిన ముగ్గురు పిల్లలు, తల్లి
జవహర్ నగర్,(విజయక్రాంతి): విధి వంచించిన ఆ కుటుంబాన్ని అగ్నిప్రమాదం మరింత కుంగదీసింది. కష్టపడి సంపాదించుకున్న రూపాయి రూపాయి పోగేసి కొనుక్కున్న వస్తువులు, పిల్లల భవిష్యత్తుకు ఆధారం కావాల్సిన సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని బీజేఆర్ నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది.
స్థానిక నివాసి అయిన రాధ అనే మహిళ, తన భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలను సాకుతూ ఇళ్లల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రాధ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.
సుమారు 6, లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేసింది.పిల్లల విద్యా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు పూర్తిగా కాలిపోయాయి.ఇంట్లో భద్రపరుచుకున్న పావు తులం బంగారం, దాచుకున్న నగదు బుగ్గిపాలయ్యాయి. బట్టలు, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు అన్నీ బూడిదయ్యాయి. భర్త లేని తరుణంలో, ఇళ్లల్లో బట్టలు ఉతుకుతూ, పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్న రాధకు ఇప్పుడు తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోయింది.
ప్రస్తుతం ఆ కుటుంబం కట్టుబట్టలతో వీధిన పడింది.చాలా కష్టపడి పిల్లలను పెంచుకుంటున్నాను. ఈ ప్రమాదం నన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి," బాధితురాలు రాధ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బస్తీవాసులు, రాధ పరిస్థితిని చూసి చలించిపోయారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆర్థికంగా ఆదుకోవాలని బస్తీ వాసులు ముఖ్యంగా జవహర్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.




