అభివృద్ధి జరగాలంటే యాక్షన్ ప్లాన్ అమలు కీలకం
టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి, మార్చి 6(విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన యాక్షన్ ప్లాన్ అమలు కీలకమని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆమె అన్నారు.
ప్రతి శాఖ అధికారి సమయపాలన పాటిస్తూ, అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని నిర్మల జగ్గారెడ్డి సూచించారు. యాక్షన్ ప్లాన్లో నిర్ణయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.




