తెల్లాపూర్‌లో అక్రమ నీటి దందా
ట్యాంకర్ల ద్వారా విచ్చలవిడిగా తరలింపు
రాత్రింబవళ్లు సాగుతున్న సరఫరా
పట్టించుకోని అధికారులు
పటాన్చెరు, ఏప్రిల్ 10: పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్లో అక్రమ నీటి దందా తజోరుగా కొనసాగుతుంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ తెల్లాపూర్ ప్రాంతంలో వేల లీటర్ల ట్యాంకులలో నీటిని నింపి లారీల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. అక్రమ నీటి వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
స్థానికంగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడిగేవారు..చర్యలు తీసుకునేవారు లేకపోవడంతో అక్రమ వ్యాపారుల నీటి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. భారీ ట్యాంకర్ల రాకపోకలతో రహదారులు దెబ్బతింటుండటమే కాకుండా ప్రమాదాలకు కూడా ఆస్కారం ఏర్పడుతోందని స్థానికులు అంటున్నారు. అక్రమంగా సాగుతున్న వాటర్ ట్యాంకర్ల దందాపై తక్షణమే చర్యలు తీసుకుని భూగర్భ జలాల దోపిడీని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో తీవ్ర నీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పారిశ్రామిక ప్రాంతాలకు తరలింపు?
జిన్నారం మండలంలో సుమారు 400 వరకు పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ నీటి వినియోగం చాలా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు నీటి దందాకు తెరలేపారు. ట్యాంకర్లలో నీటిని నింపుకొని పరిశ్రమలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందిస్తూ అందినకాడికి అక్రమార్కుల నుండి దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఒక దశలో రైతులకు ఆశలు చూపి వారి బోర్ల నుండి నీటిని తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే పంథా కొనసాగితే వేసవిలో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోయి తీవ్ర నీటి కటకట ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు.




