7 April, 2026 | 3:49 PM

ఇసుక వివాదం : పార్టీ ప్రతిష్టకు పరీక్షగా మారిన అంతర్గత సంఘర్షణ

07-04-2026 01:59 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): ​సత్తుపల్లి మండలం నారాయణపురం శివార్లలో వెలుగులోకి వచ్చిన అక్రమ ఇసుక రవాణా ఉదంతం, ఇప్పుడు కేవలం ఒక చట్టపరమైన సమస్యగానే కాకుండా, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆత్మపరిశీలనకు దారితీస్తోంది. వరంగల్ విజిలెన్స్ అధికారులు ఆంధ్ర ప్రాంతం నుండి వస్తున్న లారీలను పట్టుకోవడం ఒక ఎత్తయితే, ఈ వ్యవహారంలో వినిపిస్తున్న పేర్లు పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

​అంతర్గత విభేదాలు - బాధ్యతారాహిత్యం

​బేతుపల్లికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు ఈ వివాదంలో కేంద్రబిందువు కావడం వెనుక కేవలం వ్యాపార ప్రయోజనాలే కాకుండా, సొంత పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులతో నెలకొన్న ఘర్షణలే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొందరు వ్యక్తులు చేసే పొరపాట్లు, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వేలాది మంది కార్యకర్తల కష్టాన్ని "బూడిదలో పోసిన పన్నీరు"గా మారుస్తున్నాయి.

నాయకత్వంపై ప్రజలకున్న అచంచలమైన విశ్వాసాన్ని ఇటువంటి సంఘటనలు దెబ్బతీసే ప్రమాదం ఉంది. ​ప్రజలు ప్రతి కదలికను గమనిస్తున్నారు. వారు ఏమీ మాట్లాడనంత మాత్రాన వారికి ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటు. పార్టీ సిద్ధాంతాలు ఎంత గొప్పవైనా, క్షేత్రస్థాయిలో నాయకుల ప్రవర్తనే ప్రజలకు ప్రామాణికం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, వారిని దూరం పెట్టకపోతే ఆ "మచ్చ" కేవలం వ్యక్తులకు పరిమితం కాకుండా మొత్తం వ్యవస్థకు అంటుకుంటుంది. ఇసుక స్మగ్లింగ్ వివాదం ఒక చేదు నిజాన్ని గుర్తుచేస్తోంది:

పార్టీ బలం నాయకుడి హోదాలో లేదు, వారు పాటించే విలువలలో ఉంది. పార్టీ పేరును అడ్డం పెట్టుకుని వ్యవస్థను మేనేజ్ చేయాలనుకోవడం తాత్కాలిక లాభమే తప్ప, లాంగ్ రన్‌లో అది పార్టీ పునాదులనే బలహీనపరుస్తుంది. ​కార్యకర్తలు కోరుకునేది ఒక్కటే.. పార్టీ ప్రతిష్టను కాపాడే నిజాయితీ, తప్పును సరిదిద్దే ధైర్యం! ​అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలి. వ్యక్తిగత ఎజెండాల కంటే పార్టీ ప్రయోజనాలే మిన్న అని నిరూపించాలి. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే పరమాధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలి.