09-02-2026 01:35:38 AM
టేకులపల్లి, ఫిబ్రవరి 8,(విజయక్రాంతి): తూము తీస్తే నీరు హృదాగా పోనున్నాయి. కాలువ గైడ్ వాల్ కు బుంగ ఏర్పడటంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. ఇది టేకులపల్లి మండలం రామచంద్రునిపేట పంచాయతీ పరిధిలోని పారికలవాగు చెరువు పరిస్థితి. ఈ ఏడాది వర్షాలు విపరీతంగా పడటంతో చుక్క నీరు కూడా చెరువునుంచి వాడకుండా మొదటి పంటగా వరి సాగు చేశారు.
చెరువులో నిండుగా నీరు ఉండటంతో ఆయకట్టు రైతులు మొత్తం మొక్కజొన్న, పెసర తదితర పంటలు వేశారు. తీరా నీరు పెడదామంటే తూము నుంచి నీరు వదిలితే చెరువుకట్ట సమీపంలోని కాలువ సైడ్ గైడ్ వాల్ పగిలి దుంగ ఏర్పడింది. ఆ దుంగ నుంచి వదిలిన నీరంతా సమీపంలోని పారికలవాగులోకి వెళ్తున్నాయని రైతులు అంటున్నారు.
చెరువు కట్ట మొదలుకొని మురుట్ల, రామచంద్రునిపేట వరకు ఉన్న కాలువ పెద్ద పెద్ద చెట్లు పెరిగి అడవిని తలపించే విధంగా తయారైంది. తక్షణమే కాలువ గైడ్ వాల్ ను మరమ్మతులు చేపట్టి నీటిని వదిలితేనే వేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. నీటిశాఖ అధికారులు వెంటనే సమస్యని పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పారికలవాగు చెరువులో నిండా నీరుండి ఉపయోగం లేకుండా పోతుందని అంటున్నారు. వేసిన రెండో పంటపై రైతుల ఆశలు అడియాశలేనా అని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈ రవికుమార్ ను వివరణ కోరగా దానిని పరిశీలించామని త్వరలోనే మరమ్మతులు చేపడతామన్నారు.