15 August, 2026 | 2:54 AM

వాటర్ లాగింగ్‌పై హైడ్రా జోనల్ కమిషనర్ల సమీక్ష

15-08-2026 12:00 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): నగరంలో వర్షాకాలంలో పునరావృతమయ్యే నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఐపీఎస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఐఏఎస్ ఉమ్మడిగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

శుక్రవారం జరిగిన ఈ పర్యటనలో శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మల్కం చెరువు, ఎలక్షన్ కమిషన్ కార్యాలయం, హెచ్సీయూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రధాన నీటి నిల్వ కేంద్రాలను అధికారులు స్వయంగా పరిశీలించారు. జోన్ డెప్యూటీ కమిషనర్, హైడ్రా ఉన్నతాధికారులు, సర్కిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

పర్యటనలో అధికారులు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, ప్రస్తుత డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించారు. వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా సులభంగా ప్రవహించేలా తక్షణం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.వర్షాల సమయంలో వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా, ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్లు స్పష్టం చేశారు.గుర్తించిన సమస్యలకు తాత్కాలిక, శాశ్వత పరిష్కారాలు వెంటనే అమలు చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.