రోడ్డు ప్రమాదంలో భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
జవహర్‌నగర్,(విజయక్రాంతి): దమ్మాయిగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. స్విఫ్ట్ కారు ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతుల్లో భర్త అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం లక్ష్మీనగర్ కాలనీకి చెందిన షేక్ నాగూర్ షరీఫ్ (59), ఆయన భార్య షేక్ కరీమున్నీసా (56) సోమవారం రాత్రి బాలాజీనగర్ నుంచి దమ్మాయిగూడ వైపు జూపిటర్ స్కూటీపై వెళ్తున్నారు.
రాత్రి 11.30 గంటల సమయంలో విశాంక్ మోటార్స్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన స్విఫ్ట్ కారు (TS 07 EA 9745)ను డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ వారి స్కూటీని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో దంపతులు రోడ్డుపై పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని దమ్మాయిగూడ ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి నాగూర్ షరీఫ్‌ను అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఆయన భార్య కరీమున్నీసాకు తల, వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను టీ. సందీప్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.






