21-02-2026 08:29:33 PM
ప్రజా కవి, రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): “ప్రకృతిని రక్షించుకుందాం – వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందిద్దాం – రాజ్యాంగాన్ని కాపాడుకుందాం” అనే నినాదంతో బయలుదేరిన ప్రకృతి–వైజ్ఞానిక యాత్ర బృందం జిల్లాకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో నిర్వహించిన సభలో పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సభకు విజ్ఞాన దర్శిని రాష్ట్ర కార్యదర్శి అలీ అధ్యక్షత వహించారు. యాత్ర బృంద సభ్యులు, ప్రకృతి–ప్రజా కవి జయరాజు మాట్లాడుతూ ప్రకృతే సమస్త జీవకోటికి ఆధారం అని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకపోతే జీవితం కష్టమవుతుందని ఆయన అన్నారు. అడవులు, కొండలు, గుట్టలు మన నేస్తాలేనని, మానవ అవసరాల పేరుతో వాటిని ధ్వంసం చేయడం అన్యాయమని స్పష్టం చేశారు.
మైనింగ్ పేరుతో గుట్టలు, కొండలను తవ్వడం నేరమని, అటువంటి చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి రక్షణ బాధ్యత నేటి తరానికి చెందుతుందని అన్నారు. ప్రకృతి పరిరక్షణ కోసం తన వంతు ప్రయత్నంగా 113 కథలతో ‘అవని’ అనే పుస్తకం రాశానని జయరాజు తెలిపారు. గత ఐదేళ్లుగా ప్లాస్టిక్ రహిత తెలంగాణ కోసం ఒక బాటిల్, ఒక ప్లేట్, ఒక బ్యాగ్‌తో ప్లాస్టిక్ వాడకుండానే జీవిస్తున్నానని చెప్పారు. “రెండు నెలలు బతకడం కష్టమన్న నేను, ఇరవై ఏళ్లు బతికాను. మీరూ ప్లాస్టిక్‌ను దూరం పెట్టండి” అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
శాస్త్రీయ దృక్పథం అవసరం
మరో ముఖ్య అతిథి, విజ్ఞాన దర్శిని ఫౌండర్ మరియు యాత్ర టీం లీడర్ రమేష్ మాట్లాడుతూ, టెక్నాలజీతో మమేకమై ఉన్న విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం లోపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి విశ్వాంతరాల్లోకి ప్రయాణిస్తున్నా, మూఢనమ్మకాలు కూడా వెంటనే ప్రయాణిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలను విడిచి శాస్త్రీయ ఆలోచన అలవర్చుకోవాలని సూచించారు.
రాజ్యాంగాన్ని కాపాడాలి
యూత్ లీడర్, TPTLF రాష్ట్ర అధ్యక్షులు ఏ. విజయ్ కుమార్ మాట్లాడుతూ, మహనీయులు శాస్త్రీయ దృక్పథంతో జీవించినందువల్లే ప్రజల కోసం పనిచేశారని అన్నారు. రాజ్యాంగంలోని శాస్త్రీయ దృక్పథాన్ని అమలు చేయాలని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదేనని పేర్కొన్నారు. KVPS జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ... ప్రకృతి–వైజ్ఞానిక యాత్ర బృందం చెప్పిన అంశాలను సమాజం పాటిస్తే అందరూ ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సంకె రవి, గోడిసెల కార్తిక్, రాజేందర్, వెలిశాల కృష్ణమాచారి, నిఖిల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.