అరకొర నిధులతో అభివృద్ధి ఎలా?
కూకట్ పల్లి, మే 29 (విజయక్రాంతి): అరకొర నిధులతో కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మూసాపేట డివిజన్ భగత్ సింగ్ నగర్ లో హెచ్‌ఐజి సమీపంలోరూ. 14 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన మంచినీటి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పెద్దపీట వేశానన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిధుల కొరత లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి రెండున్నర సంవత్సరాలైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అఖండ మెజారిటీతో మూడుసార్లు గెలిపించిన ప్రజల రుణాన్ని తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, బారాస డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, బిక్షపతి, బి ఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






