ఇండ్ల గణన పక్కాగా నిర్వహించాలి
డీసీఓ భారతీ హోళికేరి
గద్వాల: జనాభా గణన 2027లో భాగంగా మొదట ఈ ఏడాది ఇండ్ల గణనను పక్కాగా చేపట్టాలని డీసీఓ (డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్) భారతీ హోళికేరి స్పష్టం చేశారు. జనగణనకు సంబంధించిన ప్రాథమిక కార్యకలాపాలపై సోమవారం హైదరాబాద్ నుంచి ఆమె సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ రూపకల్పన, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జనగణన విజయవంతంగా నిర్వహించాలంటే ప్రాథమిక స్థాయిలో చేపట్టే పనులు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ముఖ్యంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ విషయంలో సరైన రూపకల్పన, ఫీల్డ్ వెరిఫికేషన్, సిబ్బందికి సమానమైన వర్క్‌లోడ్ పంపిణీ జరగకపోతే క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. రక్షణ సంస్థలు, సున్నిత ప్రాంతాలు, జాతీయ ఆస్తులకు చెందిన ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటిని సాధారణ జనగణన ప్రాంతాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. హెచ్‌ఎల్‌బీ అనేది జనగణనలో ఒక యూనిట్‌గా పనిచేస్తుందని వివరించారు. ప్రతి హెచ్‌ఎల్‌బీకి సుమారు 750–800 జనాభా ఉండేలా చూడాలన్నారు. 2011 తర్వాత భారీ మార్పులు జరిగిన నేపథ్యంలో కొత్త లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లు, జనాభా పెరుగుదల ఇవన్నీ పరిగణలోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలన తప్పనిసరి అని తెలిపారు.
ఎన్యుమరేటర్లలో ఒకరికి తక్కువ పని, మరొకరికి ఎక్కువ పని ఉండకుండా సమానంగా బాధ్యతలు కేటాయించాలని సూచించారు. చార్జ్ అధికారులు, సూపర్వైజర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. జనగణన అనేది ఒక జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. గద్వాల ఐడిఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో సెన్సెస్ పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, సిపిఓ పాపయ్య, డిపిఓ శ్రీకాంత్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




