30 March, 2026 | 10:47 PM

హామీల మరిచిపోయి.. ఉద్యమకారులపై ఉక్కుపాదం

30-03-2026 09:01 PM

చివ్వెంల: తెలంగాణ ఉద్యమకారులపై ముందస్తు అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థి నాయకులు, ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా అనంతుల మధుతో పాటు భాషిపంగు సునీల్, ఏనిగా సంతోష్ రెడ్డి, భూక్యా నాగు నాయక్‌లను చివ్వెంల ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతుల మధు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.