‘హస్తం’లోఆశ.. నిరాశ..!
- ఇదిగో... అదిగో.. అంటూ కాలయాపన
మార్చి 15లోపు పదవులు భర్తీ చేస్తామన్న పీసీసీ చీఫ్
మార్చి గడిచినా కాంగ్రెస్‌లో పదవుల ఊసే లేదు
కాంగ్రెస్ నాయకుల్లో పెరుగుతున్న అసహనం
మేడ్చల్, మార్చి 31 (విజయక్రాంతి): కాంగ్రెస్ ముఖ్య నాయకుల ప్రకటనలు ఆ పార్టీలోని నేతలను ఆశ నిరాశలకు గురి చేస్తున్నాయి. ఇదిగో అదిగో నామినేటెడ్ పదవులు అంటూ ప్రకటనలు ఇవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఊసే ఎత్తకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మార్చి 15వ తేదీ లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని గత నెలలో ఢిల్లీలో ప్రకటించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నాయకుల సమావేశం జరిగిన తర్వాత పిసిసి అధ్యక్షుడు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు సంతోషపడ్డారు. కానీ మార్చి నెల ముగిసిన నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. జిల్లాలో పలువురు నాయకులు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు.
జిల్లాలో మేడ్చల్, కుతుబుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు రాని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన గుర్తింపు ఇస్తామని వివిధ పార్టీలకు చెందిన వారిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. కానీ వారికి ఇంతవరకు పదవులు ఇవ్వలేదు. ముఖ్య నాయకులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశిస్తే, ద్వితీయ శ్రేణి నాయకులు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఆశిస్తున్నారు.
పార్టీ పదవులు అంతే....
డిసిసి కార్యవర్గంలో చోటు కోసం పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఆరట పడుతున్నారు. డిసిసి అధ్యక్షుడిని నియమించి నాలుగు ఐదు నెలలు అయింది. ఇంతవరకు పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, కోశాధికారి పదవులు ఖాళీగా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసిన తరువాత పదవులు తగ్గిపోయాయి.
గతంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్ పదవులు ఉండేవి. ప్రస్తుతం ఈ పదవులు ఏమీ లేవు. దీంతో పలువురు నాయకులు పార్టీ పదవులు ఆశిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని 14 జిల్లాల్లో డీసీసీ కార్యవర్గాలను నియమించారు. మిగతా జిల్లాల్లో నియమించలేదు. అందులో మేడ్చల్ జిల్లా కూడా ఉంది.
కాంగ్రెస్ నేతల్లో పెరుగుతున్న అసహనం
నామినేటెడ్, పార్టీ పదవులు ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వాయిదా వేస్తుండడంతో కాంగ్రెస్ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. రెండు సంవత్సరాలుగా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఏదో ఒకటి అడ్డంకి రావడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు రావడం వల్ల నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. ప్రస్తుతము ఏ అడ్డంకులు లేవు.
రెండున్నరెళ్ళే మిగిలిందని ఇంకెప్పుడు భర్తీ చేస్తారని కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్, డిసిసి పదవులు భర్తీ చేస్తే అనేక మంది నాయకులకు పదవి యోగం కలుగుతుంది. రెండేళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వం వచ్చిన తమకు ఏమి వచ్చిందని ఎవరైనా అడిగితే చెప్పుకోలేక పోతున్నామని వాపోతున్నారు. అధికారంలోకి రావాలని ఎంతో కష్టపడ్డామని, కానీ సరైన ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




