1 September, 2026 | 12:27 AM

ఉద్యోగ విరమణ రోజు.. తల్లికి ఘన సన్మానం

31-08-2026 11:15 PM

తల్లి కాళ్లకు నమస్కరించి రుణం తీర్చుకున్న ఉపాధ్యాయుడు కాసర్ల వెంకటేశ్వర్‌రెడ్డి

మోతె,(విజయక్రాంతి): ఉద్యోగ విరమణ వేళ కన్నతల్లిని వేదికపైకి ఆహ్వానించి సన్మానించిన ఓ ఉపాధ్యాయుడి తీరు అందరినీ కదిలించింది. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం సేవలందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన కాసర్ల వెంకటేశ్వర్‌రెడ్డి ఉద్యోగ విరమణ వేడుక సోమవారం మోతెలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆమెను వేదికపైకి ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెట్టి శాలువాతో ఘనంగా సన్మానించారు. ‘‘నన్ను కని, పెంచి, చదివించి ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దింది మా అమ్మే.

నా జీవితంలో మొదటి గురువు, దైవం మా అమ్మే. ఉద్యోగ విరమణ రోజున మొదటి సన్మానం మా తల్లికే చెందాలి’’ అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. దీంతో సభలోని పలువురి కళ్లలో నీళ్లు తిరిగాయి.తన ఉద్యోగ జీవితంలో సహకరించిన ఉపాధ్యాయులు, అధికారులు, బంధుమిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధికారి గోపాల్‌రావు హాజరయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.