సలేశ్వరం జాతరలో హోం గార్డ్ ఆత్మహత్య
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పయపల్లి పరిధిలోని సలేశ్వరం మహాజాతర పరిసరాల్లో విషాదం నెలకొంది. హోంగార్డ్ ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుగూడెంకు చెందిన బయన్న(46) కోడేరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. సలేశ్వరం జాతరలో బందోబస్తులో ఉన్న బయన్న సలేశ్వరం ప్రాంతంలో పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన పోలీస్ సిబ్బంది అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇతని భార్య మూడు సంవత్సరాల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఇతడికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా సలేశ్వరం జాతర సందర్భంగా బందోబస్తు డ్యూటీ పడిన పోలీస్ సిబ్బందికి అచ్చంపేటలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి బయన్న గైరాజరైనట్టు తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.




