1 April, 2026 | 10:31 PM

వీర వనిత అనసూయమ్మ జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయం

01-04-2026 08:25 PM

* వెలిదండలో జరిగే అనసూయమ్మ వర్ధంతి సభను జయప్రదం చేయండి

గరిడేపల్లి,(విజయక్రాంతి): కామ్రేడ్ వీరవనిత మేదరమెట్ల అనసూయమ్మ జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని పారేపల్లి శేఖర్ రావు అన్నారు.బుధవారం మండలంలోని వెలిదండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల సైదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం భర్త మేదరమెట్ల సీతారామయ్య అడుగుజాడల్లో నడుస్తూ తన పోరాటపటిమని చాటిన వీర వనిత అనసూయమ్మ జీవితం చిరస్మరణీయమని అన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీర వనిత మేదరమెట్ల అనసూయమ్మ  జీవితం అందించిన పోరాట స్ఫూర్తిని మనమంతా భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల నాలుగో తారీఖున వెలిదండ లో జరిగే వర్ధంతి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.