సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్
ఎన్నికలు ముగియగానే బాదుడా
పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి
సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
పాల్వంచ,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు విమర్శించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పెట్రోల్, డీజిల్ పై విపరీతంగా ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రతి ఎన్నికల సందర్భంగా మేము పెట్రోల్, డీజిల్ పై ఎటువంటి ధరలు పెంచమని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మిస్తూ ఎన్నికలు అయిపోయిన వెంటనే నిస్సిగ్గుగా రేట్లు పెంచుతూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి కాబట్టి ఇక్కడ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతున్నామని మాట్లాడుతున్న బిజెపి కేంద్ర సర్కార్ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఎందుకు ఇక్కడ ధరలు తగ్గించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు.
ఇప్పుడు చమురు ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని, నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు మరింతగా పెంచి ఆయిల్ కంపెనీలకు దోచిపెట్టడానికి ఈ దేశపాలకవర్గం సిద్ధంగా ఉన్నదిని, ప్రజా వ్యతిరేక విధానాలుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలే మాత్రమే ప్రజలను రక్షిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్ జిల్లా సమితి సభ్యులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, వీ పద్మజ, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






