16 August, 2026 | 1:58 PM

సూర్యాపేటలో అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం

16-08-2026 01:11 PM

సూర్యాపేట : విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సు ఆదివారం తెల్లవారుజామున తెలంగాణలోని సూర్యాపేట(Suryapet district) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  ఆకుపాముల ప్రాంతంలో శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కు చెందిన సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాల్లో కలిపి మొత్తం 58 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయారు. 

రెండు గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై బాధితులు మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రమాదం తెల్లవారుజామున 2:30 నుండి 3 గంటల మధ్య జరిగిందని తెలిపారు. డ్రైవర్ అజ్మత్ ఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించి వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, అతనికి తల భాగంలో గాయాలయ్యాయి కానీ, ప్రస్తుతం అతను ప్రమాదం నుండి బయటపడ్డాడని సూచించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలలో ఆ ప్రైవేట్ బస్సు నుజ్జునుజ్జుగా మారిన స్థితిలో కనిపించింది. ఈ ఘటనపై కేసుమ నమోదు చేసుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అనతంరం పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.