25 May, 2026 | 8:12 PM

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

25-05-2026 07:23 PM

సామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలి

 రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల నరసింహులు డిమాండ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపులో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతు సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు డి. జంగయ్య అధ్యక్షతన సోమవారం ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల నర్సింహులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజుల్లోనే రెండుసార్లు ఇంధన ధరలను పెంచడం వల్ల రైతులు సాగు వ్యయం భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సామాన్య ప్రజలు కూడా పెట్రోల్, డీజిల్ కొనాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మద్దతు ధరల పెంపు ఒక కంటితుడుపు చర్య!

పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అత్యంత నామమాత్రంగా ఉన్నాయని నర్సింహులు విమర్శించారు. డాక్టర్ సామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం  ఆధారంగా పంటలకు మద్దతు ధరలను పెంచి ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్ర పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం 72 రూపాయలు మాత్రమే పెంచడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఇతర పంటలకు కూడా గతంలో ఉన్న ధరల కంటే కేవలం రెండు, నాలుగు పైసలు పెంచడం సరికాదన్నారు. కేంద్ర పాలకుల నిజస్వరూపం దీనివల్ల బట్టబయలైందని, వారి విధానాలు రైతులకు, సామాన్య ప్రజలకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో ప్రజలు గమనించాలని కోరారు. అఖిల భారత కిసాన్ సభ పిలుపులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ తోటపల్లి శంకర్, సీపీఐ కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, జిల్లా రైతు సంఘం నాయకులు పి. చంద్రయ్య, ఎన్. చైతన్య, ఏ. సురేష్, గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి వి. స్వరూప నాయక్, బీకేఎంయూ జిల్లా నాయకులు నరేంద్ర చారి, పి. నరసింహ, ఏఐటీయూసీ అధ్యక్షులు అంబాల ఎల్లయ్య, వెల్డింగ్ నర్సింగరావు, సైదులు, రవితేజ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.