ఎడతెరిపి లేని వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు
- లోతట్టు ప్రాంతాలు జలమయం..
- బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి..
- పలు చోట్ల రాకపోకలకు అంతరాయం
బోధన్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోధన్ మండలంలోని పస్వాగు, పెగడపల్లి వాగులు ఉప్పొంగగా, సాలూర మండలంలో వాగులు, గోదావరి ప్రవాహం ఉగ్రరూపం దాల్చాయి. వర్ని మండలంలోని జలాల్‌పూర్ వాగులో వరద ఉద్ధృతి పెరగడంతో తండావాసులు అప్రమత్తంగా ఉన్నారు.
పోతంగల్, కోటగిరి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిరికొండ మండలం కొండూరు వద్ద తాత్కాలిక అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. భీమ్‌గల్‌లో కప్పలవాగు, ధర్పల్లి మండలం వాడి వద్ద ముత్యాలమ్మ వాగు, ఏర్గట్ల మండలంలోని తీగల వాగు పొంగిపొర్లి పంట పొలాలు నీట మునిగాయి. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






