మరిమడ్లలో రైతులను నట్టేట ముంచిన రాళ్ళ వాన
– 100 ఎకరాల్లో పంటలు నేలమట్టం
కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది.చేతికొచ్చిన పంటలు ఒక్కసారిగా నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సుమారు 100 ఎకరాల మేర పంట నష్టం జరిగినట్లు అంచనా. ఈ ఘటనపై సిపిఐ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ కడారి రాములు స్పందిస్తూ, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ఫలితం రాకపోగా, ఇప్పుడు వడగండ్ల వాన వల్ల మరింత నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, వెంటనే అధికారులు స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టినా, అవి రైతులకు సకాలంలో అందడం లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులకు రైతు భీమా అందించాలని, అలాగే కొండాపూర్ చెరువు పరిధిలోని మరిమడ్ల గ్రామంలో ఉన్న 80 ఎకరాల పొడుభూములకు ఎస్సీ , ఎస్టీ , మైనార్టీలకు పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సగ్గుపట్ల దేవయ్య, పడగొల్ల మల్లేశం, గుండ్ల లాల్ భీమశంకర్, భగవాన్ రెడ్డి, డప్పుల అశోక్, డప్పుల రాజయ్య, డప్పుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.




