దళితుల భూములకు గద్దల్లా తన్నుకుపోతున్నారు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితుల భూములకు గద్దల్లా తన్నుకుపోతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. దళితుల భూముల స్కామ్ విలువ రూ.7 వేల కోట్లు అని, నాదర్ గుల్ భూముల స్కామ్(Nadar Gul Land Scam)లో ప్రభుత్వ పెద్దలు భాగస్వాములు ఉన్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ డిక్లేర్ చేసిన ప్రభుత్వ భూములను(Government Land) కేసీఆర్(KCR) కాపాడితే.. రేవంత్ వాటిని భక్షిస్తున్నారని, 374 ఎకరాల భూమిలో ఉన్న 600 మంది పేద రైతులను తమ సొంత భూముల్లోకి వెళ్లనీయకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
నాదర్ గుల్ భూములు తనవిగా శివరాజ్ కోర్టులను ఆశ్రయించడంతో 2015లో సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. 2016లో మూడు కంపెనీలకు శివరాజ్ భూమి అమ్మారని, వివాదాస్పద భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిందని హరీష్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందని, అంతేకాకుండా ప్రస్తుతం భూ భారతిలోనూ ఆ భూములుగా ప్రభుత్వ భూములుగానే చూపిస్తోందని, ఈ భూములను కేసీఆర్ హయంలో ఎవరూ కబ్జా చేయలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రేవంత్ అధికారంలోకి రాగానే కబ్జాలు మొదలయ్యాయని, నాదర్ గుల్ భూములను కాపాడేందుకు హైడ్రా ఎందుకు రావట్టేదు..? అని ప్రశ్నించారు. లింగమయ్య గుట్ట సహా దాదాపు 100 ఎకరాల్లో గుట్టాలు ఉన్నాయని, 12 ఎకరాలు ఉన్న లింగమయ్య గుట్ట తప్ప మిగతా అన్నీ కాజేశారని మండిపడ్డారు. ఈ కోట్ల కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత రెడ్డి వాటా ఎంత..? అని, కాంగ్రెస్ వచ్చాక కోహినూర్ బోర్టు.. తర్వాత శిల్పా ఇన్ ఫ్రా బోర్డు ఉందని హరీష్ చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కుమారుడి కంపెనీ శిల్పా ఇన్ ఫ్రా పేరు తొలగించారని, నిన్న జాయింట్ డెవలప్ మెంట్ అని కొత్త బోర్టు పెట్టి శిల్పా ఇన్ ఫ్రా డైరెక్టర్ జాబితాలో శిల్పా రాఘవ వెంచర్స్ ఉందన్నారు. శిల్పా రాఘవ వెంచర్స్ లో పొంగులేటి కుటుంబ సభ్యులే డైరెక్టర్లు అని, పొంగులేటి కుటుంబంపై అధికారులు చర్యలు ఎలా తీసుకుంటారు..? అని అడిగారు. అసెంబ్లీలో వ్యాఖ్యలకు సీఎం కట్టుబడి ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు.




