శేరిలింగంపల్లి జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ హామీ
శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ సానుకూల నిర్ణయం
శేరిలింగంపల్లి, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి ని యోజకవర్గ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమైన హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులం దరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని ప్రకటించారు.శుక్రవారం మియాపూర్లోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. టీయుడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు ధూపం ప్రసాద్ జర్నలిస్టుల ప్రజాహితం కోసం ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని కోరినప్పుడు, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ సానుకూలంగా స్పందించి, ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని తానే భరించేందుకు అంగీకరించారు.
ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం.డి. సలీం పాషా మాట్లాడుతూ,జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల గొప్ప మనసుతో మంచి నిర్ణయం తీసుకున్న వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్కు జర్నలిస్టులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్ననని అన్నారు.గతంలో ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు నిమ్స్ ఆస్పత్రికి మాత్రమే పరిమితమై, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా లక్షలు ఖర్చు అవుతున్నాయని, ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులకు పెద్ద ఊరట లభించనుందని సలీం పాషా వ్యాఖ్యానించారు.ఈ నిర్ణయం జర్నలిస్టుల వృత్తి ప్రమాదాలు,ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సమయంలో వారికి భరోసా కల్పిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






