21 August, 2026 | 1:50 AM

ప్రేమపేరుతో మా బిడ్డను వంచించాడు

21-08-2026 01:07 AM
  1. ఆత్మహత్య చేసుకున్న డీ టీ సంధ్య తల్లిదండ్రుల ఆవేదన 
  2. డీటీ సంధ్య రాసిన లేఖ వివరాలను వెల్లడించిన తల్లిదండ్రులు

మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య (28) ఆత్మహత్య ఘటనలో ఆమె రాసుకున్న లేఖ కీలకంగా మారింది. సంధ్య రాసిన లేఖలో తనను ఓ వ్యక్తి మాయమాటలతో మభ్యపెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన తీరును వివరించినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. అతని మాటలను నమ్మి తాను మోసపోయానని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి భవిష్యత్తుపై ఆశలు కల్పించిన అనంతరం మరో యువతిని వివాహం చేసుకోవడంతో తీవ్రంగా మనోవేదనకు గురైనట్లు సంధ్య లేఖలో పేర్కొన్నట్లు తల్లిదండ్రులు డోలి వెంకటేశ్వర్లు, పద్మ వెల్లడించారు.

తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తి కారణంగానే తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని లేఖలో సంధ్య తన బాధను వ్యక్తం చేసినట్లు తెలిపారు. తనను మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసిన అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని, తనకు జరిగిన అన్యాయానికి అతడిని కఠినంగా శిక్షించాలని సంధ్య తన లేఖలో కోరినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న విషయాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. సంధ్య రాసిన లేఖలోని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆమె చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని తల్లిదండ్రులు పోలీసులను కోరారు.