21 August, 2026 | 1:48 AM

నిలిచిపోయిన చెత్త సేకరణ

21-08-2026 01:08 AM

మరమ్మతుకు గురైన ట్రాక్టర్లు 

గ్రామంలో పేరుకుపోయిన చెత్త

ఆళ్ళపల్లి, ఆగస్టు 20, (విజయక్రాంతి): అసలే వర్షాకాలం, ఆపైన సీజనల్ వ్యాధుల తరుణం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పంచాయతీ నిర్వహణ లేని కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నిత్యం చెత్త సేకరణ చేసే పంచాయతీ ట్రాక్టర్లు మరమ్మతుకు గురి కావడంతో గత కొన్ని వారాలుగా చెత్త సేకరణ నిలిచిపోయింది. ఫలితంగా ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. తప్పని పరిస్థితిలో గ్రామస్తులు పంచాయితీ సిబ్బందికి తో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

అధికారుల పర్యవేక్షణ లేమి

పారిశుద్ధ్యం పై పంచాయతీ అధికారులు సక్రమంగా పర్యవేక్షణ లేని కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని తేటతెల్లమవుతున్నాయి. వారాల తరబడి ట్రాక్టర్లు పనిచేయకుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనునిత్యం పారిశుధ్యం పై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో మరొకడు పంచాయతీలో వారాల తరబడి చెత్త సేకరణ నిలిచిపోయిందని స్పష్టమవుతుంది. దీంతో గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ పూర్తిగా ఆగిపోయింది.

రోడ్ల పక్కన, మురికి కాల్వల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దోమలు, ఈగలు విజ్రంబించి జ్వరాలు, అంటురోగాలు ప్రభలే ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు మొక్కుబడిగా చెత్త సేకరణ చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. సర్పంచ్ పంచాయతీ,కార్యదర్శి దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని. మరమ్మతుకు గురైన ట్రాక్టర్ రిపేర్ అయ్యేంతవరకు ప్రత్యామ్నాయంగా మరొక వాహనాన్ని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు .