టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా హేడెన్
ముంబై, మార్చి 10 : ఐపీఎల్ 2026 సీజన్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీ లు తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ట్రైనింగ్ క్యాంపులు కూడా ప్రారంభించాయి. ఇదే క్రమంలో తమ సపోర్ట్ స్టాఫ్‌పైనా తుది కసరత్తు చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది.
ఈ మేరకు గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్ర మ్ సోలంకి సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హేడెన్‌ను బ్యాటింగ్ కోచ్ గా నియమించుకున్నట్టు వెల్లడించారు. యువ ఆటగాళ్ల బ్యాటింగ్‌కు హేడెన్ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ విధ్వంసకర బ్యాట ర్ గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, అసిస్టెంట్ కోచ్ పార్థీవ్ పటేల్‌తో కలిసి పనిచేయనున్నాడు. హేడెన్ గతంలో పాకిస్థాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా రనిచేశారు. అయితే పూర్తిస్థాయిలో మాత్రం ఎప్పుడూ కోచ్‌గా బాధ్యతలు చేపట్టలేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఈ ఆసీస్ దిగ్గజం 2010లో ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.




