హ్యాట్సాఫ్ అంజలి.. ఇంటర్ టాపర్ ను సన్మానించిన కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన నరాల అంజలిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిట్యాల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటడం జిల్లాకు గర్వకారణమని, జిల్లా ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తం చేశారని పేర్కొన్నారు. అంజలి సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.
అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపిసి గ్రూపులో 418 మార్కులు సాధించిన ప్రణిత, 456 మార్కులు సాధించిన భరణి లోకేష్ను కూడా కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధనకు ఉత్తమ విద్యా బోధన చేసిన అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇంగ్లీష్, జువాలజీ అధ్యాపకులు రమేష్, జీ. రమేష్ పాల్గొన్నారు.




