19-02-2026 03:05:13 AM
దక్షిణాదిన స్టార్ హీ రోయిన్‌గా సత్తా చాటుతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. విభిన్న పాత్రలతో అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాకు సైన్ చేశారు. ఎస్‌కే గీ ఎంటర్‌టైన్‌మెంట్, బెంచ్ మార్క్ స్టోరీటెల్లర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆర్జే షాన్ దర్శకత్వం వహించనుండగా శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
అనుపమ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించిన మేకర్స్ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ‘కార్తికేయ2’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో థ్రిల్లర్ జానర్‌లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అనుపమ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది.
‘క్రేజీ కల్యాణం’లో కీర్తిగా..
నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసమ్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. బుధవారం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్‌డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌లో పెళ్లి కూతురిగా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అనుపమ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు పాటలు: గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, చైతన్యప్రసాద్; డీవోపీ: శ్యామ్ దూపాటి; ఎడిటర్ : శ్రావణ్ కటికనేని ఆర్ట్: సాయి కదిర; నిర్మాత: బూసం జగన్‌మెహన్‌రెడ్డి; స్క్రీన్‌ప్లే: శ్రీనివాస రవీంద్ర; స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: భద్రప్ప గాజుల.