30 March, 2026 | 9:31 PM

గ్రామసభల్లో అన్ని శాఖల ప్రగతి వివరాలు ప్రస్తావించాలి

30-03-2026 07:44 PM

గద్వాల: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.  సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అన్ని శాఖల్లోని అభివృద్ధి కార్యక్రమాల పూర్తి వివరాలను గ్రామసభల్లో ప్రస్తావించాలన్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, తదితర పథకాల గ్రామస్థాయి వివరాలను సేకరించి ఆయా గ్రామసభల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు.

మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్ లు తరచూ తమ పరిధిలోని పాఠశాలలను, వసతి గృహాలను సందర్శించాలని, ప్రతి శుక్రవారం అక్కడే భోజనం చేయాలని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు సైతం సంబంధిత అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారని చెప్పారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ క్లియరెన్స్, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో తాను ఇటీవల పలు మండలాల్లో పర్యటించి పరిశీలించగా చాలా కార్యాలయాల్లో పాత సామాన్లు అలాగే ఉన్నాయి.

సంబంధిత అధికారులు ఆదేశాలు పాటించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం పనితీరులో చాలా మార్పు రావాల్సి ఉందని, నిర్లిప్తంగా వ్యవహరించే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు,ఆర్డీవో శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.