ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
ఫిర్యాదులు పరిష్కరించని అధికారులకు మెమోలు : కలెక్టర్
గద్వాల: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డిఓ శ్రీనివాసరావుకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ఆయా శాఖల వారీగా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్జీలు రావడమే కాక మామూలు రోజుల్లోనూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అవే సమస్యలపై తన వద్దకు వస్తున్నట్లు చెప్పారు. ప్రజావాణికి వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఉంచడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెవిన్యూ, పురపాలక శాఖలలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించకపోవడానికి కారణమేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ప్రతి బుధవారం ఆయా శాఖల జిల్లా అధికారులు తమ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ చాలామంది పాటించడం లేదని మండిపడ్డారు. ప్రజావాణి ఆర్జీలు అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉంచిన అధికారులకు మెమోలు జారీ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




