నేటి నుంచి టెన్త్ పరీక్షలు
- ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి
హాజరుకానున్న 5.17 లక్షల మంది విద్యార్థులు
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి,
కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): పదో తరగతి వార్షిక పరీక్షలు శని వారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యా ర్థులు 5.17 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు 5 నిమిషాలు (అంటే 9.35 వరకు) ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతిస్తారు. పరీక్షలకు హాజరువుతన్న వారిలో బాలురు 2,60,916 మంది, బాలికలు 2,56,811 మంది ఉన్నారు.
మరో 10,512 మంది గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులూ ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు 2,07,573 మంది కాగా, ప్రైవేట్ స్కూళ్లలోని విద్యార్థులు 2,50,015 మంది ఉన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. విద్యార్థు లు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
పరీక్షల నిర్వహణ సందర్భంగా సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్ష లు విధించారు. సిబ్బంది ఎవ్వరూ పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లొద్దని ఆదేశాలు జారీచేశారు. విద్యార్థుల మీద ఒతిడి లేకుం డా పరీక్షలు రాయాలని పరీక్షలకు గ్యా ప్ ఇచ్చామని, సీబీఎస్‌ఈ విధానాన్ని అమ లు చేశామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పాఠశాలల్లో ఎల్పీజీకి సంబంధించి ఎలాంటి కొరత లేదని ఓ అధికారి తెలిపారు.
విజయోస్తు: సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి హృదయపూర్వక శు భాకాంక్షలు తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులందరికీ విజయోస్తు తెలుపుతూ శుక్రవారం ఎక్స్‌లో పోస్టుచేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. మీలోని ప్రతిభను నమ్ముకు ని ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని సూచించారు.
మీరంతా మెరవాలి.. తల్లిదండ్రులు మురవాలి: కేంద్రమంత్రి బండి సంజయ్
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. కన్నవారి కలలను నెరవేర్చేందుకు.. ఉజ్వల భవిష్యత్తును అందుకు నేందుకు శనివారం నుంచి జరిగే పరీక్షలను మంచిగా రాసి ఉత్తీర్ణులు అవ్వాలని ఆకాంక్షించారు. పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయా నికన్నా అరగంట ముందు కచ్చితంగా వెళ్లాలని సూచించారు.
ముఖ్యంగా తన కరీం నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరీక్ష రాయనున్న విద్యార్థులందరికీ ముందస్తుగా అభినందనలు తెలిపారు. విద్యార్థులకు చదువుపై ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని తాను పదవ తరగతి చదివే పేద విద్యార్థులందరికి దాదాపుగా 20 వేల మందికి ఉచితంగా సైకిళ్లను అందజేశాననే విషయాన్ని గుర్తుచే శారు. దీంతో పాఠశాలకు విద్యార్థులంతా సకాలంలో వెళ్లేందుకు అవకాశం దక్కిందని చెప్పారు. పరీక్ష ఫీజును తాను చెల్లించానని, దీంతో వారి తల్లిదండ్రులకు కొంత ఆర్థిక భారం తప్పిందన్నారు.
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: కేటీఆర్
పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎస్‌ఎస్సీ పరీక్షల్లో ప్రతీ విద్యార్థి మంచి ప్రతిభ కనబర్చి, విజయం సాధిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. జీవితంలో మొదటి పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నందున ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




