17 June, 2026 | 9:58 PM

తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

17-06-2026 08:30 PM

​దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కీర్య తన పిల్లలను, తను పాఠాలు బోధిస్తున్న పాఠశాలలోనే చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వేరొకరికి చెప్పే ముందు తామే ఆచరించి చూపాలి అనే మాటను నిజం చేస్తూ నాగుపల్లి జడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాల ఉపాధ్యాయుడు ఎమ్. కీర్య సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల మోజులో పడి సామాన్యులు సైతం అప్పులు చేసి మరి తమ పిల్లలను వేల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్న నేటి రోజుల్లో, ఆయన సరికొత్త స్ఫూర్తినిచ్చారు. ​ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు ఉన్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు ఆయన ఒక గొప్ప ముందడుగు వేశారు. తాము ప్రతిరోజూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే తన పిల్లలను చేర్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తనకు ఉన్న నమ్మకాన్ని, నిబద్ధతను చాటుకున్నారు.