రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి
బోథ్,(విజయక్రాంతి): రైతులు పండించిన జొన్న పంట మొత్తంను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి టౌన్ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు బి.శ్రీధర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన జొన్న పంటను ఎకరానికి కేవలం పది క్వింటాళ్లు కొనుగోలు చేస్తామనడం సరైనది కాదన్నారు.
దిగుబడిని ఆధారంగా చేసుకుని కొనుగోలు చేయాలని వారు కోరారు. కాగా ప్రభుత్వానికి రైతులకు అవసరమైన గన్ని బ్యాగులను కొనుగోలు చేసి ఇవ్వడం చేతకావడం లేదని దీనితో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు గన్ని బ్యాగులను 35 రూపాయలు అవిక్రయిస్తున్నారన్నారు. దీంతో రైతుకు నష్టం సంభవిస్తుందని ప్రభుత్వం వెంటనే స్థానికంగా ఉన్న పరిస్థితులను గమనించి గన్ని బ్యాగులను పంపించాలని వారు కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్కరాజు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు






