11 June, 2026 | 2:51 AM

రెండు ఎకరాలకేనా రైతు భరోసా!

11-06-2026 01:44 AM

యాసంగిలో సగం మందికే పెట్టుబడి సాయం

మూడో విడత భరోసాపై స్పష్టతనివ్వని సర్కారు 

బిఆర్‌ఎస్ హయంలోనే రైతుకు ‘రైతు బంధు’ 

కాంగ్రెస్ ప్రభుత్వంలో అయోమయంలో అన్నదాతలు..

మెదక్, జూన్ 10 (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వానా కాలం సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో యాసంగి రైతు భరోసా అందలేదు. రెండు ఎకరాలలోపు రైతులకే రెండు విడతల్లో ప్రభుత్వ పెట్టు బడి సాయం అందింది. ఇక వానా కాలం సాగుకు పెట్టు బడి సాయం ఎప్పుడు అందుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు వానా కాలం సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఎరువులు, విత్తనాలు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. యాసంగి పంటకు పెట్టు బడి సాయం రెండు ఎకరాలకు పరిమితం చేయడంతో వానా కాలం పంటకు అందే పెట్టు బడి సాయం పై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు బంధు ఇచ్చింది బిఆర్‌ఎస్..

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పంట పెట్టు బడి సాయం కింద రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు పంటలకు కలిపి రూ.10 వేల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతులు పెట్టు బడి సాయం రాగానే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే వారు. అంతేకాదు దున్నుకాలకు ట్రాక్టర్ కిరాయి, కూలీలకు సరిపడ డబ్బులు ఉండేవని రైతులు చెబుతున్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరు మార్చి రైతులకు పెట్టు బడి సాయం అందించడం లేదని ఆరోపిస్తున్నారు. 2024-25 లో రైతు భరోసా కింద మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు మాత్రమే భరోసా డబ్బులు జమ చేశారు. ఈ యాసంగి లో రెండు ఎకరాలకు పరిమితం చేశారు.  దీంతో రైతులు అప్పులు చేసి పంటలను పండిస్తున్నారు. ప్రభుత్వం కనీసం 5 ఎకరాల వరకు పెట్టు బడి సాయం అందిస్తామని కటాఫ్ ప్రకటించి  ప్రతీ రైతుకు పెట్టు బడి సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.

రెండు విడతల్లో ఇలా..

మెదక్ జిల్లాలో 3,00,558 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.232 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, రెండు విడతల్లో కలిపి 2,67,980 మంది రైతులకు రూ.166 కోట్లను జమ చేసింది. ఇంకా 30 వేల మంది రైతులకు రూ. 66 కోట్లు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో 3 లక్షల మంది రైతులు ఉండగా, 2,76,128 మంది రైతులు బ్యాంకు అకౌంట్ లను వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించారు. ఇంకా 24,430 మంది రైతులు బ్యాంకు ఖాతాలు ఇవ్వలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతీ రైతుకు రెండు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అందించింది. కనీసం 5 ఎకరాల వరకైనా పెట్టు బడి సాయం అందిస్తుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది. 

రూ.166కోట్లు జమ చేశాం..

రెండు విడతల్లో రైతు భరోసా కింద 2.67 మంది రైతులకు రూ.166 కోట్లు జమ చేశాం. మరో 30 వేల మందికి రూ. 67 కోట్లు రైతు భరోసా డబ్బులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నిధులను విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.

 దేవ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి