చల్లని కబురు
- కేరళంలోకి నైరుతి రుతుపవనాలు
- వారం రోజుల్లో తెలంగాణలోకి..
- మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశం
- జూలై మధ్య నాటికి దేశమంతా విస్తరణ
- ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం
- ఎల్‌నినో ముప్పు ఉందన్న ఐఎండీ
న్యూఢిల్లీ, జూన్ 4(విజయక్రాంతి): మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి చల్లని కబురు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళంలోకి ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
జూలై మధ్య నాటికి దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక మూడు రోజులు ఆలస్యమైంది. కాగా, రుతుపవనాల ప్రభావంతో కేరళంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు, తమిళనాడులోని 15 జిల్లాల్లోనూ రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.
దశల వారీగా దేశమంతటికీ..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు రాబోయే రోజుల్లో దశలవారీగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. జులై మధ్య నాటికి దేశం మొత్తాన్ని కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే కొన్ని వారాల పాటు ఇవి ఎంత వేగంగా ముం దుకు సాగుతాయనేది చాలా కీలకంగా మారనుంది.
ముంబైలో ముందస్తుగానే..
మరోవైపు ముంబై నగరంలో ముందస్తు వర్షాలు మొదలయ్యాయి. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదర్, మాటుంగా, అంధేరి వంటి ప్రాంతాలలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ ఏడాది ముంబైలో రుతుపవనాల కాలంలో 4.5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో 24 సార్లు హైటైడ్స్ (సముద్రపు అలల ఉధృతి) వచ్చే అవకాశం ఉందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) హెచ్చరించింది. జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు మొదటి విడత అలల ఉధృతి ఉంటుంది. జూలై 16 నాడు ఈ సీజన్లోనే అత్యంత గరిష్టంగా 4.89 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడవచ్చు. ఈ సమయంలో ప్రజలు బీచ్లు, సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు.
సూపర్ ఎల్‌నినో ముప్పు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్- సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్‌లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 92 శాతం వర్షాలు పడుతాయని ఏప్రిల్ నెలలో ఐఎండీ అంచనా వేసినప్పటికీ ఇప్పుడు దాన్ని 90 శాతానికి తగ్గించారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం లో సూపర్ ఎల్‌నినో పరిస్థితులు ఆవిర్భవిస్తున్నాయని, జూన్‌లో ఇవి బలహీనంగా ఉన్నా సెప్టెంబరులో మాత్రం బలంగా ఉండే అవకాశం ఉందని వివరించింది. గత 20 ఏళ్లలో ఎల్‌నినో వచ్చిన ఆరు సందర్భాల్లో దేశంలో కరువు పరిస్థితులు లేదా తక్కువ వర్షపాతం నమోదైంది.
75 శాతం వర్షాలు నైరుతి ద్వారానే..
దేశవ్యాప్తంగా కురిసే మొత్తం వర్షాలలో 75 శాతం వాటా నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. దేశంలోని సగానికి పైగా వ్యవసాయ భూములు ఈ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు తగ్గితే ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చెరకు పండించే వర్షాధార ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పంటల దిగుబడి తగ్గి ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, స్థానిక ఉపాధిని దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఆలస్యానికి కారణాలు
నైరుతి రుతుపవనాలు మే 26వ తేదీనే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని తొలుత భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. కానీ, ఈసారి పశ్చిమ పసిపిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా రుతుపవనాలను నెమ్మదింపజేసింది. ఈ కారణాల వల్ల రుతుపవనాల రాక ఆలస్యమైనట్లు ఐఎండీ పేర్కొంది.
5 రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం నుంచి రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 50 కి.మీ.ల వేగంతో కూడిన వర్షాలు కురువనున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, జనగాం జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదివారం జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, న ల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కురుస్తాయి.
ఢిల్లీలో భారీ వర్షం
న్యూఢిల్లీ, జూన్ 4: దేశ రాజధాని ఢిల్లీ లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం వల్ల ఇన్నాళ్లూ భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు తీవ్రమైన ఎండల నుంచి పెద్ద ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసా రిగా మారిపోవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) దేశ రాజధానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది.
ఆ తర్వాత బలమైన గాలులతో కూడిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోవడంతో వాతావరణ శాఖ అంతకుముందు ఇచ్చిన ఎల్లో అలర్ట్‌ను రెడ్ వార్నింగ్‌గా మార్చింది. ఢిల్లీతో పాటు పొరుగున ఉన్న నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల వర్షం రాకముందే భారీ ఈదురు గాలుల వల్ల ధూళి, తుఫాను లాంటి పరిస్థితులు కనిపించాయి. ఈ దాడుల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. ఈ వర్షాల వల్ల నగరంలో గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కాగా, కనీస ఉష్ణోగ్రత 29.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.






