12 June, 2026 | 2:00 AM

గ్లామర్ అవసరమే, కానీ..

12-06-2026 12:52 AM

సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా, భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా నటించిన కొత్త చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. “నేను అస్సాం అమ్మాయిని. చిన్నప్పట్నుంచే నటన అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు కూడా చూస్తూ పెరిగిన నేను చదువుకుంటూనే ఆడిషన్స్ ఇస్తూ వచ్చా.

అప్పట్లో నాకు తెలుగు అస్సలు రాదు. అయినా వెనక్కి తగ్గలేదు. దాదాపు మూడేళ్లపాటు చుట్టుపక్కల వాళ్లతో తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ భాషపై పట్టు సాధించా. ఈ చిత్రంలో నా పాత్ర పేరు వరలక్ష్మి. ఆమె కోనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. నటిగా నాకు మంచి అవకాశాన్నిచ్చిన క్యారెక్టర్. అస్సాంలోని మా జీవన శైలి వేరు, ఇక్కడి కోనసీమ లైఫ్‌స్టుల్ వేరుగా ఉంటాయి.

అందుకే షూటింగ్ ప్రారంభానికి ముందు నెల రోజుల పాటు అక్కడే ఉండి స్థానికుల జీవనశైలి, డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్, యాస.. అన్నింటినీ పరిశీలిస్తూ నేర్చుకున్నా. అందుకే ఇప్పుడు నన్ను చూసి అందరూ అచ్చ తెలుగమ్మాయి అని అంటున్నారు. ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి.

ప్రేక్షకులు తప్పకుండా ఆదరి స్తారని నమ్ముతున్నా. మంచి కథ, పాత్ర అయితే అది సినిమా అయినా, ఓటీటీ ప్రాజెక్ట్ అయినా చేయడానికి నేను సిద్ధమే. నటిగా మంచి పేరు తెచ్చుకోవడం, నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం నా లక్ష్యం. ఒక హీరోయిన్‌కు గ్లామర్ అవసరమే. కానీ అది మాత్రమే సరిపోదు. నటన, పాత్రల ఎంపిక,  ప్రదర్శనా ముఖ్యమే”.