13 June, 2026 | 4:11 AM

అమ్మాయిలదే పైచేయి!

13-06-2026 12:19 AM
  1. ఐసెట్‌లో 91 శాతం ఉత్తీర్ణత
  2. ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఐసెట్  ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 91 శాతం ఉత్తీర్ణత సాధించి అబ్బాయిల కంటే మెరుగైన స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో మొదటి రెండు ర్యాకుల్లో కూడా అమ్మాయిలే ఉండటం గమనార్హం.

మొత్తంగా 46,654 (91.22 శాతం) మంది అభ్యర్థులు ఐసెట్‌కు అర్హత సాధించగా..  అమ్మాయిలు 91.62 శాతం, అబ్బాయి లు 90.74 శాతం మంది ఉన్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాయంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాప్ హుస్సేన్, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, -ప్రొఫెసర్ మహమూద్, కార్యదర్శ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ప్రొఫెసర్ ఆలువాల రవితో కలిసి ఐసెట్ ఫలితాలు విడుదల చేశారు.    

హాజరైన అభ్యర్థులు, ఉత్తీర్ణత 

మే 13, 14 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌కు తెలంగాణ వ్యాప్తంగా 56,206 మందికి గాను 51,146 మంది హాజరయ్యారు. అందులో 46,654 మంది అర్హత సాధించారు.  బాలికలు 30,299 మంది దరఖాస్తు చేసుకోగా 27,793 మంది హాజరయ్యారు. వీరిలో 25,463 మంది(91.62శాతం) అర్హత సాధించారు. అబ్బాయిలు 25,907 మందికి 23,353 మంది పరీక్ష రాశారు. వారిలో 21,191 మంది(90.74శాతం) ఉత్తీర్ణులయ్యారు.

తొలి రెండు ర్యాంకులు వీరికే..

ఐసెట్ ఫలితాల్లో తొలి రెండు ర్యాంకులు హైదరాబాద్ నగరానికి చెందిన అమ్మాయిలు దక్కించుకున్నారు. ఫస్ట్ ర్యాంకును ఎ.ఐశ్వర్యారెడ్డి, రెండో స్థానంలో కె.లిఖిత నిలిచారు.

287 కాలేజీలు.. 40,601 సీట్లు  

రాష్ట్రంలో 287 ఎంబీఏ కాలేజీలు ఉండగా వాటిలో 40,601 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదిలో 35,141 సీట్లు భర్తీ అయ్యాయి. 80 ఎంసీఏ కాలేజీలు ఉండగా 9360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 5,420 సీట్లు భర్తీ అయ్యాయని చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఐఏసీటీఈ అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.