7 April, 2026 | 10:26 AM

గిగ్ బిగ్ షాక్

01-01-2026 01:36 AM

* నూతన సంవత్సరం వేళ.. బుధవారం గిగ్‌వర్కర్లు బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో ఆన్లైన్ డెలివరీలు నిలిచిపోయాయి. కొన్ని  స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా డెలివరీ కార్మికులు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. దీంతో నూతన సంవత్సర పార్టీలకు ఫుడ్ ఆర్డర్ చేయడం నుంచి ఆన్లైన్ డెలివరీల వరకు ప్రతిదానిపై ప్రభావం పడింది. గిగ్ కార్మికులు న్యాయమైన వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ‘10 నిమిషాల డెలివరీ’ని రద్దు చేయాలని, ఇంకా అనేక ఇతర డిమాండ్లను నెరవేర్చాలని సమ్మెలోకి దిగారు.

ఏడాదిలో అత్యంత అమ్మకాలు జరిగే ఈ రోజే వర్కర్లు స్ట్రైక్ చేస్తుండటంతో కస్టమర్ల ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇయర్ ఎండ్ రెవెన్యూ టార్గెట్లను చేరుకోవడానికి డిసెంబర్ 31 డెలివరీలపై ఆధారపడే రిటైలర్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ ధర్నాపై స్విగ్గీ, జొమాటో స్పందించకుండా ప్రోత్సాహకాలను అయితే పెంచింది. పండుగల సీజన్‌లో పీక్ అవర్స్‌లో రూ.2వేల నుంచి 3వేల వరకు సంపాదించొచ్చని పేర్కొంది.

నూతన సంవత్సర వేడుకల వేళ.. గిగ్ వర్కర్స్ దేశవ్యాప్త సమ్మె

వేతనాలు, భద్రత సహా అనేక డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా

స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా డెలివరీ యాప్ సేవలపై ప్రభావం

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: గిగ్‌వర్కర్ల సమ్మెను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూ యూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఆప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ), గిగ్ అం డ్ ప్లాట్ఫారమ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (జీఐపీఎస్‌డబ్ల్యూయూ) నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్ డెలివరీ కార్మికు లను గిగ్‌వర్కర్లు అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే..! ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యాప్ ఆధారిత ప్లాట్‌ఫా రమ్ డెలివరీలను బుధవారం బంద్‌చేసి, కీలక ప్రదేశాల్లో శాంతియుత నిరసనలు చేశామని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ) జాతీయ ప్రధానకార్యదర్శి షేక్ సలావుద్దీన్ అన్నారు.

డిసెంబర్ 25న ఆన్లైన్ ప్లాట్ఫామ్ కంపెనీలను సమ్మెకు హెచ్చరించారని, కానీ గిగ్ కార్మికులతో ఎటువంటి చర్చలూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత లేదా పనిగంటలు కూడా నిర్దేశించలేదని ఆయన వివరించారు. అందువల్ల, డిసెంబర్ 31న మరో సమ్మె చేశామని తెలిపారు. గిగ్‌కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే జోక్యంచేసుకోవాలని కోరా రు. భారత డిజిటల్ మార్కెట్‌కు వెన్నెముకగా నిలిచే డెలివరీ భాగస్వాములకు కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

జీవనోపాధి పోరాటం

ఇది కేవలం నిరసన మాత్రమే కాదని, గిగ్ కార్మికుల జీవనోపాధి, ప్రాథమిక హక్కుల కోసం పోరాటం అంటున్నారు ఆన్లైన్ డెలివరీ బాయ్స్. ఆర్డర్ల ఆధారంగా గిగ్ కార్మికుల వేతనాలు తగ్గించారు. ఇంకా, దూరం, సమయం ఆధారంగా పరి హారం కూడా తగ్గించారు. దీంతో గిగ్‌కార్మికులు గతం కంటే తక్కువ సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దోపిడీకి గురవుతున్న గిగ్ కార్మికులు 

గిగ్ కార్మికులు దోపిడీకి గురవుతున్నారు అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ అల్గోరిథమ్‌ల ద్వారా గిగ్ కార్మికులను దోపిడీ చేస్తున్నారని తెలిపారు. 10 నిమిషా ల డెలివరీ అంటే డెలివరీ చేయడానికి ఎక్కువ ఒత్తిడి. ఈ పరిస్థితిలో, అత్యధిక వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమా దాలు, మానసిక ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. 

గిగ్ వర్కర్లు రోడ్డెక్కకపోతే.. సిటీల్లో పెద్ద సమస్యే..

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు బుధవారం సమ్మె చేశారు. సరిగ్గా న్యూఇయర్ వేళ టైం చూసి స్పాట్ పెట్టారు. గిగ్ వర్క ర్లు రోడ్డెక్కకపోతే, డెలివరీలు చెయ్యకపోతే, చాలా మంది ఇబ్బంది పడతారు. ముఖ్యంగా సిటీల్లో పెద్ద సమస్యే. మరి కేంద్రం సమస్యల్ని పరిష్కరిస్తుందా?లేదో వేచిచూడాలి మరి!

సమ్మె ప్రభావం ఎలా ఉంటుంది?

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ఫుడ్ డెలివరీ డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉంటుంది. కానీ ఈ సమ్మె వల్ల మిలియన్ల మంది కస్టమర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గిర్ వర్కర్లు సమ్మెలో ఉండటంతో స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫారమ్స్‌పై తీవ్ర ప్రభావంపడుతుంది. ప్లాట్ఫారమ్ కంపెనీలు థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉపయోగించి సమస్యను తగ్గించే ప్రయత్నం చేశాయి.  

పీక్ అవర్స్‌లో రూ.2వేల నుంచి 3వేల వరకు

గిగ్‌వర్కర్ల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో డిలివరీ ఏజెంట్లకు స్విగ్గీ, జొమాటో ప్రత్యేకప్రోత్సాహకాలిస్తున్నట్లు పేర్కొన్నా యి. పండగ, ప్రత్యేక రోజుల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య పనిచేసే వర్కర్లకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి 150 వకు చెల్లిస్తామని జొమాటో పేర్కొంది.  ఒక్కొక్కరూ రూ.3వేల వరకు సంపాదించొచ్చని తెలిపింది. స్విగ్గీ సైతం ఆఫర్ ప్రకటించింది. పీక్‌అవర్స్‌లో ఒక్కొక్కరు రూ.2వేల ఆర్జించవచ్చని పేర్కొంది. కానీ స్విగ్గీ, జొమాటో, జెప్టో అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.