15 August, 2026 | 5:18 AM

78 మందికి శౌర్య పురస్కారాలు

15-08-2026 02:15 AM

వీరిలో తొమ్మిది మందికి కీర్తి చక్ర, ౧౯ మందికి శౌర్య చక్ర

జాబితాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౪: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన జవాన్లకు అందించే 78 శౌర్య పురస్కారాలకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తొమ్మిది మందికి కీర్తి చక్ర, 19 మందికి శౌర్య చక్రాలు అందిస్తున్నామని ప్రకటించింది. కీర్తి చక్ర సాధించిన వారిలో ఏడుగురికి, శౌర్య చక్ర సాధించిన వారిలో ఒకరికి మరణానంతరం ఈ పురస్కారాలు లభించాయని తెలిపింది.

సైనిక, నావిక, వాయుసేన విభాగాల్లో విశిష్ట సేవలందించిన జవాన్లకు ఐదు సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ), 36 సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ), మూడు నౌ సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ), ఐదు వాయు సేనా మెడల్స్ (గ్యాలెంట్రీ) అందిస్తున్నామని వివరించింది. సేనా మెడల్స్ సాధించిన వారిలో ఐదుగురికి మరణానంతరం పురస్కారం దక్కిందని తెలిపింది. శౌర్య పురస్కారాలతో పాటు 89 మంది జవాన్ల విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘మెన్షన్- ఇన్- డిస్పాచెస్’ పురస్కారాలు అందిస్తున్నామని స్పష్టం చేసింది. జాబితాలో సైన్యానికి చెందిన 75 మంది, నౌకాదళానికి చెందిన నలుగురు, వాయుసేనకు చెందిన 10 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది.