రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో హై లెవెల్ వంతెనల నిర్మాణాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నాలుగు హై లెవెల్ వంతెనల నిర్మాణానికి జీఓ నంబర్ 457 ద్వారా రూ.52 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించామని తెలిపారు.
ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను రూ.10 కోట్లకు పరిమితం చేసి, వాటినే హై లెవెల్ వంతెనల నిర్మాణాలకు మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.10 కోట్లతో నాలుగు హై లెవెల్ వంతెనల నిర్మాణం ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో హై లెవెల్ వంతెనలకు నిధులు మంజూరు చేశామని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, వాస్తవానికి అవి రోడ్ల అభివృద్ధి నిధులేనని ఆరోపించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసం ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మరోసారి మోసం చేయొద్దని మల్యాల దేవయ్య హెచ్చరించారు.






